సమస్యలు ఎదురైనా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగవని, పేదల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలో పర్యటించిన మంత్రి పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి కష్ట సమయాల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు.
కరోనాకు భయపడకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామాల్లో కూడా కరోనా విస్తరిస్తున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. మంత్రి వెంట గ్రంథాలయ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, కౌన్సిలర్లు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.