బుధవారం శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనంత పెద్ద స్థాయిలో ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నామని, నిస్సహాయులకు, నిరుపేదలకు సాయం అందించాలనే ప్రయత్నంగానే ప్రభుత్వం ఈ పించన్ పథకాన్ని అమలు చేసిందని తెలిపారు. ఇప్పటివరకు 24.21 లక్షలమంది అర్హులను ఎంపిక చేశామని, లబ్ధిదారుల ఎంపిక నిరంతరం కొనసాగుతూ ఉంటుందని సీఎం పేర్కొన్నారు. గతంలో పెన్షన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిన దానికన్నా 380 శాతం అధికంగా నిధులు కేటాయించామని, ఇందుకోసం ప్రతిసంవత్సరం రూ. 3,350 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఇతర నిరుపేదలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.
గత పాలకులు పించన్ వృద్ధులు, వితంతువులకు రూ. 200, వికలాంగులకు రూ. 500 మాత్రమే ఇచ్చేవారని, ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా వారి కనీస అవసరాలు కూడా పెరిగినందున పెన్షన్లు పెంచామని కేసీఆర్ చెప్పారు. వృద్ధులు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500లకు పెంచామని, దేశంలోనే ఎక్కువమంది నిస్సహాయులకు ఆర్ధికసాయం అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగంలో నిలిచిందని పేర్కొన్నారు. పించన్ పథకాలకు అర్హుల ఎంపిక నిరంతరం జరుగుతూనే ఉంటుందని, అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని సీఎం స్పష్టం చేశారు.