తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సత్ఫలితాలనిస్తున్నది. ఈ పథకం కేవలం పేదింటి వారి పెండ్లి కష్టాలను తీర్చడమే కాకుండా రాష్ట్రంలో బాల్యవివాహాలను రూపుమాపే దిశగా పరుగులు పెడుతోంది. 2014 లో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఇప్పటివరకు పరిశీలిస్తే బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా బాలికల విద్య 32 శాతం పెరిగింది. ఆడపిల్ల పుడితే రూ.13 వేల ఆర్ధికసాయంతో పాటు, కేసీఆర్ కిట్, అంగన్ వాడీ కేంద్రాలనుండి నాణ్యమైన ఆహారం, తల్లీ బిడ్డకు సాయం వంటి కార్యక్రమాలతో నవజాత శిశువుల స్థాయి నుండే బాలికల సంరక్షణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పెండ్లీడుకొచ్చిన తర్వాత ఇచ్చే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఆడపిల్లలకు వరంగా మారింది.
ఈ పథకం ద్వారా రూ.1,00,116 లను రాష్ట్ర ప్రభుత్వం 18 ఏండ్లు నిండిన వారిని అర్హులుగా నిర్ణయిస్తూ వారి పెండ్లి సమయానికి ఆడపిల్ల తల్లి చేతికి ఈ చెక్కును అందిస్తున్నది. 18 ఏండ్ల కంటే ఒక్క నెల తక్కువగా ఉన్నా వారికి ఈ పథకం వర్తించదు. అధికారులు కూడా బాల్యవివాహాలు జరక్కుండా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పథకంలో చేర్చిన నిబంధనలతో రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గి బాలికలను బడి, కాలేజీల వైపుకు వెళ్ళేలా మార్గం చూపెడుతోంది. రాష్ట్రంలో ఈనెల మొదటివరకు 4,28,855 మందికి గానూ మొత్తం రూ. 2,763.99 కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.