mt_logo

పొత్తుల విషయం తేల్చనున్న కేసీఆర్

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో అని తెలంగాణ ప్రజానీకం ఊహాగానాలు చేస్తున్న తరుణంలో బుధవారం నాడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొత్తులపై సందిగ్ధత తొలగించనున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్య సయోధ్య ఉందని భావిస్తున్న తరుణంలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ టీఆర్ఎస్ పార్టీపై అవాకులూ చవాకులూ పేల్చడం పరిపాటయింది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దొరల పాలన వస్తుందని, మరో జార్ఖండ్ అవుతుందని అనటం, టీఆర్ఎస్ పార్టీని ఆమ్ఆద్మీ పార్టీతో పోల్చడం, జేఏసీ నేతలకు టిక్కెట్లు ఇస్తామంటూ రెచ్చగొడుతూ జైరాం రమేష్ మాట్లాడటం కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పార్టీ పొత్తుల విషయంలో వెనక్కు తగ్గేలా చేసింది. దానికితోడు కాంగ్రెస్ పార్టీ నేతలుకూడా టీఆర్ఎస్ తో పొత్తులు వద్దని, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు. దీనికంతటికీ కారణమైన జైరాం రమేష్ తెలంగాణ వ్యతిరేకి అని, ఆయన కారణంగానే తెలంగాణకు నష్టం వాటిల్లిందని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. గులాబీనేతలు కూడా కాంగ్రెస్, బీజేపీతో పొత్తులు వద్దని సూచించడంతో కేసీఆర్ పొత్తుల విషయమై బుధవారమే తేల్చనున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా ఉద్యమంలో మొదటినుండీ కలిసివచ్చిన సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలతో పొత్తులు ఉంటాయని, ఇప్పటికే సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నారాయణలతో కేసీఆర్ చర్చలు జరిపినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *