mt_logo

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!

By: నారదాసు లక్ష్మణ్‌రావు

కేసీఆర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్!. ఏ పనైనా మొదటి అడుగుతోనే ఆరంభమవుతుంది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. తెలంగాణ సాధించడానికి తానొక్కడై మొదటి అడుగు వేసారు. కోట్లాది పాదాలు ఆయన దారిలో అడుగులు కలిపాయి. ఇప్పుడు పునర్నిర్మాణానికి తొలి అడుగు వేశారు. ఆఖరి గమ్యాన్ని చేరే వరకు తెలంగాణ సమాజమే ఆయనకు అండగా నిలుస్తుంది.

ప్రజల దృష్టిలో చట్టసభలు ఆధునిక దేవాలయాలు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా సభ్యులు ప్రజల నుదుటి రాతను రాస్తున్న విధాతలు. ప్రజల విశ్వాసం ఎంత పవిత్రమైనదో అనుక్షణం ప్రతి సభ్యుని మదిలో కదలాడుతుండాలి. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రథమ ప్రాథమ్యం కావాల్సిన చోట, అసత్యాలు అభూతకల్పనలను ఆలంబనగా చేసుకొని నిష్క్రియా పరత్వాన్ని ప్రదర్శించే ప్రతి సభ్యుడు దేశద్రోహ నేరం చేసినట్టే.
మార్క్సిస్ట్ తత్వశాస్త్ర దృక్పథంలో అభివృద్ధికి సంబంధించి ఏ రంగంలో అయినప్పటికీ, ఏదైనప్పటికీ తన మునుపటి అస్థిత్వ విధానం అభావం చెందకుండా అభివృద్ధి చెందజాలదు అని నిర్వ చిస్తారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు దీనిని అన్వయించుకున్నపుడు గత ప్రభుత్వాల వలసవాద, అభివృద్ధి నిరోధక అస్థిత్వ ఛాయలను తొలగించుకొని, మనదైన అభివృద్ధిని సాధించుకోవడానికి తొలి అడుగులు పడుతున్న దశ ఇది. పరిణతి చెందిన తెలంగాణ సమాజం, విముక్తిని ప్రసాదించిన వివేకవంతునికే అధికార పగ్గాలు అప్పగించింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి మన ప్రభుత్వం-మన ప్రణాళికలు అన్న నినాదంతో అత్యున్నత ఫలితాలే లక్ష్యంగా వినూత్న పథకాలెన్నింటినో ప్రకటించారు కె.సి.ఆర్. రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, ఆసరా, ఆహార భద్రత, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లు ప్రజల భవితవ్యాన్ని మార్చేవి. పథకాల రూపకల్పన, సమాచార సేకరణ, అమలు అనే దశలుంటాయని తెలిసిందే! ఆసరా పథకం అమలుకు కసరత్తు సాగుతుండగానే ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని యత్నిస్తున్నాయి. ప్రతిపక్షాలెప్పుడూ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉంటాయి. అది తప్పుకాదు. కానీ, అందుకోసం దిగజారుడు విధానాలు అనుసరించడమే ఆక్షేపనీయం. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రజలను గందరగోళపరుస్తూ, కుట్రదారులకు తొత్తులుగా మారి తమ సహజస్వభావాన్నే ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో బి.పి.ఎల్. కుటుంబాల కంటే మిన్నగా ఉన్న తెల్లకార్డులను చూశాం. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలోని అక్రమాలూ బహిర్గతమే!

తమ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడానికి భూస్వాములు, సంపన్నులకు కూడా ఇబ్బడి ముబ్బడిగా పింఛన్లు ఇచ్చి ప్రజాధనాన్ని ఎంతగా దుర్వినియోగం చేశారో తేటతెల్లమయ్యింది. ఇప్పుడు మన ప్రభుత్వం దేశంలోనే అత్యధిక సాయంగా చెల్లిస్తున్న ఆసరా పథకంను అభినందించాల్సింది పోయి సర్కా రు మెడలు వంచుతాం… తీసేసిన పింఛన్లన్నీ ఇప్పిస్తాం అంటూ జానారెడ్డి గారు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? పింఛన్లు రావన్న బెంగతో ప్రజలు గుండెలు పగిలి చస్తున్నారని, ఆత్మహత్యలు చేసుకొని మరణిస్తున్నారని భారీ మాటలతో పచ్చ పత్రికలు పచ్చి అబద్ధాలు రాయడం, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని కిషన్‌రెడ్డి లాంటి వారు ప్రకటనలు చేయడం, కుట్రల శిబిరాల ఉనికిని స్పష్టం చేస్తున్నాయి.

ముఖ్యమంత్రి గారు సభలో ఒక విలువైన ప్రకటన చేశారు. సభలో విచక్షణారహితంగా ఆరోపణలు చేయడం కాకుండా, ఆరోపణలకు రుజువులుండాలి. లేనట్టయితే శిక్షలుండాలి అని! ఆరోపణలకు డాక్యుమెంట్లు చూపాలనడం విడ్డూరం అంటూ జీవన్‌రెడ్డి గారు అనడం విడ్డూరమే. నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ, నైతికతను పాటించకుండా సభను పక్కదారి పట్టించే నిరాధార ఆరోపణ చేసి, ఎంత సంచలనానికి తెరలేపితే అంత పాపులారిటీ వస్తుందనుకోవడం బాధ్యతారాహిత్యం కాదా? విద్యుత్ సంక్షోభంపై తీవ్ర చర్చ జరుగుతూ, చంద్రబాబు కుట్రలను ప్రభుత్వం వివరిస్తున్నపుడు, తెలంగాణ విద్యుత్ వినియోగానికి సంబంధించి తప్పుడు లెక్కలు చూపి పక్క రాష్ట్రానికి వంత పాడడం రేవంత్‌రెడ్డి గారు మాతృభూమికి ద్రోహం చేసినట్లు కాదా?

తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేసి వందలాది యువకుల బలవన్మరణాలకు కారకులైన వీరే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే శక్తులుగా అవతరించారు. ఎన్ని త్యాగాలతోనో సాధించుకున్న సొంత రాష్ట్ర శాసనసభలో కూచున్నామన్న భావన, మర్యాదపూర్వక ప్రవర్తన ప్రతిపక్ష సభ్యులలో కొందరికి లేకపోవడం బాధాకరం. రోడ్డుపై నిలబడి.. తెలంగాణ శాసనసభ అన్న బోర్డును చూసినా గుండెలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి అని ఉద్యమంలో పాల్గొన్న ఒక ఉపాధ్యాయుడు నాతో అన్నారు.

కానీ వీరుల త్యాగాల పునాదులపై నిర్మించుకున్న సభలో తొలి తెలంగాణ శాసనసభ్యుడిగా కూచున్న వారికి కొందరికి ఈ ఉద్వేగం లేకపోవడం ఎంత భావదారిద్య్రం? వీళ్ళు తెలంగాణ ఉద్యమంతో కానీ, సమాజంతో కానీ మమేకం కాకపోవడమే ఇందుకు కారణం కాదా? సొంత రాష్ట్రాన్ని సాధించుకోవడం, ఆత్మ గౌరవాన్ని ప్రకటించుకోవడం, నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సభకు ప్రాతినిధ్యం వహించడం ఇవేవి వారికి ఉన్నత మైనవిగా తోచడం లేదు. ఎందుకంటే సీమాంధ్ర వలసవాద ప్రభుత్వాలలో ఎమ్మెల్యేలు గానో, మంత్రులుగానో పని చేశారు. ఇప్పుడూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గత సభకు, ఇప్పటి సభకు, గత ప్రభుత్వాలకు, ఇప్పటి ప్రభుత్వానికి, గతంలో ప్రవర్తించిన తీరుకూ, ఇప్పుడు ప్రవర్తించాల్సిన తీరుకు వ్యత్యాసమే తెలియకుండా పోవడం వారి దౌర్భాగ్యానికి నిదర్శనం. ఈ చారిత్రక సందర్భంలో ఈ మట్టి, ఇక్కడి మనుషుల రుణం తీర్చుకోవాలనే ఉద్వేగంతో వారు లేరు. కుట్రదారులతో కలిసి నడిచిన వారికి అస్థిత్వ స్పృహ ఉంటుందనుకోవడం కూడా తప్పే!

సీమాంధ్రులతో విడిపోతే తెలంగాణ అధ:పాతాళానికి పోతుందని ప్రచారం చేసిన వారు, లక్ష కోట్ల బడ్జెట్‌తో స్వయంపోషక బాటలో పయనించే సంకేతాలను చూసి ఓర్వలేకపోతున్నారు. స్వీయ అస్థిత్వాన్ని ప్రకటించుకున్న సందర్భంలోనూ, శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్.టి.ఆర్ పేరును ప్రకటింపజేసుకోగలిగారంటే సీమాంధ్రులు ఇంకా మనపై ఎలాంటి పెత్తనానికి కాలు దువ్వుతున్నారో అర్థం కావడం లేదా? విభజన నేపథ్యంలో పదేండ్ల వరకు రాజధాని, మరికొన్ని ముఖ్యమైన ఉమ్మడి అంశాలు సీమాంధ్రుల పడగనీడలోనే ఉన్న సందర్బంలో, తెలంగాణ రాజకీయ శక్తులన్నీ ఏకతాటిపై నిలవాల్సిన అవసరం లేదా?

ప్రజలు తెలంగాణ సాధించుకోవడంతో పాటు కె.సి.ఆర్‌కు అధికారాన్ని కట్టబ్టెడం ద్వారా ఒక పెద్ద గండం నుంచి మనను గట్టెక్కించినారనిపిస్తుంది. కె.సి.ఆర్ కాక ఇతర ఏ పార్టీ అధికారాన్ని చేపట్టినా, తెలంగాణ, సీమాంధ్రుల విషకౌగిలిలో చిక్కి విలవిల లాడేది. దేహం తెలంగాణ, ఆత్మ ఆంధ్ర అన్న పరిస్థితి దాపురించేది. ఆంధ్రులతో అంటకాగి, అధికారాన్ని అనుభవించి తెలంగాణకు మరణ శాసనాన్ని లిఖించిన పార్టీల వాళ్ళే ఇప్పుడు రైతుల గురించీ, బడుగు బలహీన వర్గాల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు.

కె.సి.ఆర్‌ పై విషం చిమ్మే ప్రయత్నాలు ఎన్ని చేసినా ఆయన సంకల్పాన్ని అడ్డుకోలేరు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ ఆయనపై వ్యక్తిగత విమర్శలతో ముప్పేట దాడి చేశారు. కానీ, అతడే ఒక సైన్యమై తెలంగాణ సాధకుడిగా నిలిచారు. ప్రాణాన్ని పణంగా పెట్టి లక్ష్యాన్ని సాధించిన కేసీఆర్ ను పనికిరాని ఎత్తుగడలతో పడగొట్టాలని చూడడం, పర్వతాన్ని చూసి చిట్టెలుక సవాలు చేస్తూ గంతు లేసినట్టు ఉంటుంది. కేసీఆర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్! ఏ పనైనా మొదటి అడుగుతోనే ఆరంభ మవుతుంది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. తెలంగాణ సాధించడానికి తానొక్కడై మొదటి అడుగు వేసారు. కోట్లాది పాదాలు ఆయన దారిలో అడుగులు కలిపాయి. ఇప్పుడు పునర్నిర్మాణానికి తొలి అడుగు వేశారు. ఆఖరి గమ్యాన్ని చేరేవరకు తెలంగాణ సమాజమే ఆయనకు అండగా నిలుస్తుంది. ఈ పవిత్ర కార్యానికి అడ్డు పడిన వారు ప్రగతి రథచక్రాల కిందపడి నలిగిపోక తప్పదు.

(వ్యాసకర్త మాజీ ఎమ్మెల్సీ)

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *