హోంగార్డుల సమస్యలపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆర్ధిక మంత్రి ఈటెలను కలిసి వివరించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ, హోంగార్డులకు దసరా పండుగ లోపు జీతాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. హోంగార్డులు చాలా బాధ్యతతో పనిచేస్తున్నారని, వారికి మూడు నెలలుగా జీతాలు రావడంలేదని తెలిసిందని, పండుగ లోపు మూడునెలల జీతాన్ని ఇస్తామని స్పష్టం చేశారు. హోంగార్డులను ఆదుకుంటామని ఉద్యమం జరిగే సమయంలోనే సీఎం కేసీఆర్ చెప్పారని, వారి సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులకు వచ్చినట్లుగానే రెగ్యులర్ గా జీతాలు వచ్చేలా ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తో మాట్లాడామని, దీనిపై స్పందించిన మంత్రి హోంగార్డులకు రెగ్యులర్ గా జీతాలు వచ్చేలా బడ్జెట్ లో ప్రవేశపెడతామన్నారని నాయిని చెప్పారు.
అనంతరం ఈటెల మాట్లాడుతూ, హోంగార్డుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళామని, దసరా పండుగ లోపు జీతాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. అదేవిధంగా అర్హులకు 20 నుండి 35 కిలోల బియ్యం ఇవ్వాలని అనుకుంటున్నామని, ఇప్పటి వరకు 12 లక్షల బోగస్ రేషన్ కార్డులు వెనక్కు వచ్చాయని పేర్కొన్నారు. బంగ్లాలు, ఉద్యోగాలు ఉన్న వాళ్లకు గత ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పేదవాళ్ళ కోసమేనని, అర్హులకే ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల్లో ఆనందాన్ని చూసేలా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఈటెల అన్నారు.