mt_logo

దర్యాప్తు జరిపించాలె

రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర ఉద్యోగులను ఇంకా ఇక్కడే కొనసాగించడానికి కుట్రలు సాగడం ఆందోళన కలిగిస్తున్నది. మూడు తరాలుగా ఇక్కడే అక్రమంగా ఉద్యోగాలు చేసింది చాలక, విభజన తరువాత కూడా ఇక్కడే తిష్టవేయాలనుకోవడం క్షమించరాని నేరం. సీమాంధ్ర కుట్రల నేపథ్యంలో- తెలంగాణకు చెందిన నలుగురు శాసన సభ్యులు, ఇద్దరు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు అయింది. ఉద్యోగులు సమర్పించిన స్థానికత వివరాలు సరైనవేనా కాదా అనేది ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీ చేత సీమాంధ్ర ఉద్యోగుల అక్రమ నియామకాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలె. దోషులపై చర్యలు తీసుకోవాలె. గతంలో తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్లలో అన్యాయం జరిగిందని ఫిర్యాదులు రావడంతో, ప్రధాని ఇందిరా గాంధీ జస్టిస్ బేగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఏడాది మాత్రమే కాల పరిమితిని విధించింది.

ఈ కమిటీ అనవసర వాయిదాలు వేయకుండా ఏడాదిలోగా వేలాది ఫిర్యాదులను పరిశీలించి నివేదిక తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది తెలంగాణ ఉద్యోగులను తొక్కి పెట్టి సీమాంధ్ర వారికే ప్రమోషన్లు కట్టబెట్టిందని ఈ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. సీమాంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యోగుల పట్ల కక్షతో, వివక్షతో వ్యవహరించారని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఆధారాలు అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా పరిమిత గడువులోగా వేగంగా ఇంతకాలం సాగిన అక్రమ నియామకాలపై దర్యాప్తు జరిపించాలె. తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవహరిస్తే ఉద్యోగులు, అధికారులు తమ వివరాలు అందించక తప్పదు. ఇక్కడ అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలు సేకరించి వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలె.

తెలంగాణలో సీమాంధ్ర ఉద్యోగులను నింపడానికి అనేక కుట్రలు జరిగాయి. జనరల్ కోటాలో మెరిట్ ప్రాతిపదికపై అన్ని ప్రాంతాల వారికి విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే నిబంధనను కూడా సీమాంధ్ర పాలకులు వక్రీకరించి తెలంగాణ వారిని మోసం చేశారు. జనరల్ కోటాకు నాన్‌లోకల్ కోటా అని నామకరణం చేసి, వాటిని మొత్తం సీమాంధ్ర వారితో భర్తీ చేయడం పెద్ద మోసం. ఉపాధ్యాయ ఉద్యోగాలు జిల్లా స్థాయివి అయినప్పటికీ నాన్‌లోకల్ ముసుగులో అనేక మంది సీమాంధ్ర వారిని జిల్లాల్లో భర్తీ చేశారు. తెలంగాణలో దాదాపు ఇరవై వేల మంది సీమాంధ్ర ఉపాధ్యాయులు ఉంటే, సీమాంధ్రలో ఐదు వందల మంది మాత్రమే తెలంగాణ వారున్నారు. తెలంగాణలో అడ్డావేసిన సీమాంధ్రులను పంపకుండా అడ్డుపుల్ల వేయడానికి వేలాది మంది ఉద్యోగుల స్థానికత వివరాలు మాయం చేయడం మరో పెద్ద కుట్ర. యాభై వేల మంది ఉద్యోగుల స్థానికత వివరాలు లభించడం లేదని వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో ప్రకటించడం సిగ్గుచేటు.

ఉద్యోగుల నుంచి సేకరించే ప్రాథమిక వివరాలలో స్థానికత ఒకటి. ఆ వివరాలు లేకుండా ఉద్యోగాలు ఎట్లా ఇచ్చారు, జీతాలు ఎట్లా ఇస్తున్నారు? తనకు స్థానికత వివరాలు ఇవ్వడం లేదని శాఖాధిపతులు సహకరించడం లేదని గిర్‌గ్లానీ చెప్పినప్పుడు వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి అధికారుల కమిటీలు, సభా కమిటీలు, మంత్రుల కమిటీలు వేస్తారు. జీవోల మీద జీవోలు జారీ చేస్తారు. కానీ ఏదీ అమలు కాదు. తెలంగాణ సమాజానికి ద్రోహం చేయడానికి ఇన్ని కుట్రలా! ఈ కుట్రలకు బాధ్యులైన వారిపై, ఈ కుట్రల మూలంగా లబ్ధి పొందిన వారిపై చర్య తీసుకోవలసిందే. న్యాయబద్ధంగా పంపిణీ చేయమని తెలంగాణ ఉద్యోగులు కోరడంలో తప్పేమీ లేదు. సీమాంధ్ర కుట్రలను తిప్పికొట్టడానికి తెలంగాణ ఉద్యోగులకు అన్ని వర్గాల వారు మద్దతుగా నిలబడాలె. తెలంగాణ రాజకీయ శక్తులు, ఉద్యోగ సంఘాలు, ఇతర రంగాలకు చెందిన తెలంగాణ ప్రముఖులు కలిసికట్టుగా వ్యవహరించక పోతే, సొంత రాష్ట్రం ఏర్పడి కూడా సీమాంధ్ర పాలనలో మగ్గవలసిన గతి పడుతుంది.

తెలంగాణకు జరిగిన మోసం, వలస వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో- ఉద్యోగుల పంపిణీకి స్థానికత మాత్రమే ప్రాతిపదిక కావాలె. స్పష్టమైన స్థానికత ఆధారాలు చూపించని వారిని తెలంగాణ ప్రజా ప్రభుత్వం స్వీకరించకూడదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టానికి ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటే వారిని కార్పొరేషన్‌లలో ఇతరత్రా ఉపయోగించుకోవచ్చు. ఎట్లా ఉపయోగించుకుంటారనేది వారి తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో సిబ్బందికి కొరత ఏర్పడితే, ప్రమోషన్లు, నియామకాల ద్వారా తీర్చుకోవచ్చు. తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగులను సీమాంధ్రకు పంపించకూడదు. ఇప్పుడు ఉద్యోగుల విభజన కోసం రూపొందించిన తాత్కాలిక జాబితా కూడా తప్పుల తడకగా ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి జాబితా ప్రకటించి బుధవారం మధ్యాహ్నం వరకే అభ్యంతరాల గడువు పెట్టడం కూడా కుట్రనే. స్థానికతను నిర్దేశించే ప్రాతిపదికల పట్ల స్పష్టత లేదు. ఉద్యోగులు ఏది చెబితే దానినే ఆధారంగా తీసుకోవడం సబబు కాదు. ఇప్పటి వరకు జరిగిన అక్రమాలను చక్కదిద్దమని, న్యాయబద్ధంగా పంపిణీ చేయమని తెలంగాణ ఉద్యోగులు కోరడంలో తప్పేమీ లేదు.

సీమాంధ్ర కుట్రలను తిప్పికొట్టడానికి తెలంగాణ ఉద్యోగులకు అన్ని వర్గాల వారు మద్దతుగా నిలబడాలె. తెలంగాణ రాజకీయ శక్తులు, ఉద్యోగ సంఘాలు, ఇతర రంగాలకు చెందిన తెలంగాణ ప్రముఖులు కలిసికట్టుగా వ్యవహరించక పోతే, సొంత రాష్ట్రం ఏర్పడి కూడా సీమాంధ్ర పాలనలో మగ్గవలసిన గతి పడుతుంది. తెలంగాణ ఏర్పాటు బిల్లును చింపి, కాళ్ళతో తొక్కి, తగుల బెట్టిన సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడ కొనసాగడాన్ని తెలంగాణ ప్రజలు సహించరు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *