శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఎంతో ప్రయోజనం కలిగించనున్న డ్యామ్ ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మోతె ప్రాజెక్టు పనులు పెండింగ్ లో ఉన్నాయని, కోరట్ పల్లి, రామడుగు గ్రామస్థులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, త్వరలోనే బాధిత ప్రజలతో మాట్లాడి ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించి పనులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా పోతారం, నారాయణపురం డ్యాంలను కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పై బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ లేవనెత్తిన అంశంపై మంత్రి హరీష్ స్పందిస్తూ, నిజామాబాద్ ఎంపీపై చేసిన అసత్య ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెబితే సమస్య పరిష్కారమైతదని, రేవంత్ రెడ్డి ఎంపీ కవిత విషయంలో సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని అన్నారు. ఏపీ నుండి రావాల్సిన విద్యుత్ మనకు రాకపోయినా వస్తున్నట్లు ప్రజలకు తప్పుడు సమాచారం అందించారని, రాష్ట్ర ద్రోహం మనకు మంచిదా? అని ప్రశ్నించారు. ఆంధ్రా శాసనసభలో గత 14 ఏళ్లుగా మేం సస్పెండ్ అయ్యాం.. శాసనసభ చరిత్రలో తొలిసారిగా బడ్జెట్ పై 15 గంటల చర్చ జరగడం ఇదే తొలిసారి అని, అర్ధవంతమైన చర్చకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హరీష్ రావు చెప్పారు.