రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించినా ఊరుకునేది లేదని, ఇది పూర్తి రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తన రెండురోజుల పర్యటన ముగిసాక గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడే ప్రతి విషయం తనకు తెలుసని, అధిష్టానాన్ని ఎవరు వ్యతిరేకించినా తీవ్ర పరిణామాలుంటాయన్నారు. సోమవారం నాడు జరిగే బీఏసీ సమావేశంలో బిల్లుపై చర్చను జరిపే అవకాశాలున్నాయన్నారు. అసెంబ్లీలో శాసనసభ్యులందరూ తమ అభిప్రాయాన్ని వారంరోజుల్లోగా తెలపాలని, బిల్లు పార్లమెంటు సమావేశాల్లోపు చేరడం ఆలస్యమైనా, వెంటనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశముందన్నారు. న్యాయశాఖను సంప్రదించిన తరువాతే కేంద్రం బిల్లును రూపొందించిందని, ఏవైనా మార్పులుంటే కేంద్ర కేబినెట్ మళ్ళీ పరిశీలిస్తుందన్నారు. రెండు ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలను కేంద్రం అభివృద్ధి చేస్తుందని ఆయన అన్నారు.
నీటి పంపకాలకు సంబంధించి నిపుణుల కమిటీని వేస్తామని దిగ్విజయ్ చెప్పారు. సీమాంధ్రలోకూడా కేంద్ర సంస్థలు ఏర్పాటు చేస్తామని. పోలవరం నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజల ఆస్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు దిగ్విజయ్. రెండు ప్రాంతాల పీసీసీలు ఏర్పాటు చేయాలని తమకు సూచనలు వచ్చాయని, సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సోనియాగాంధీపై ఆరోపణలు చేస్తున్న అనంతపురం ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డికి షోకాజ్ నోటీస్ పంపుతామని చెప్పారు. చంద్రబాబుకు ఏమి కావాలో ఆయనకే అర్ధం కావట్లేదన్నారు. టీఆర్ఎస్‌తో సంబంధం గురించి అడగగా, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ అన్నారని ఆయన గుర్తుచేశారు.