ఈరోజు శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి ఆందోళన చేయడంతో స్పీకర్ సభను పదినిమిషాలపాటు వాయిదా వేశారు. కాంగ్రెస్ నేతల తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వంద ఎలుకల్ని చంపి తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు ఉందని, 2004 లో 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నప్పుడు రూల్స్ అడ్డురాలేదా? అని, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిందింది కాంగ్రెస్సేనని అన్నారు.
అనంతరం భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఫిరాయింపులు మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు టీడీపీని చీల్చలేదా? అని, మొన్నటికి మొన్న మా పార్టీ ఎంపీ విజయశాంతిని, ఎమ్మెల్యే అరవింద్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. సభా వ్యవహారాల ప్రకారమే శాసనసభ నడుస్తుందని, అందుకు సభ్యులంతా సహకరించాలని హరీష్ సూచించారు.