రాష్ట్రంలో నెలకొనిఉన్న విద్యుత్ సంక్షోభానికి గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణమని, వాళ్ళు చేసిన తప్పులను వదిలిపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. ఈ పరిస్థితులకు కారణమైన సోనియాగాంధీ, మోడీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలు దహనం చేయకుండా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయడం సరికాదని, చంద్రబాబు హయాంలో కరెంట్ లేక ప్రజలు తీగలపై బట్టలు అరేసుకునే పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు.
జానారెడ్డి నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రధాన సమస్య అయిన ఫ్లోరైడ్ గురించి ఏనాడూ మాట్లాడలేదని, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని, కాంగ్రెస్ నేతల అవినీతి, అక్రమాలను బయట పెట్టే పనులు మొదలవడాన్ని చూసి తట్టుకోలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని నాయిని అన్నారు. సెప్టెంబర్ 17 న జెండా ఎగురవేస్తామన్న కిషన్ రెడ్డి ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినప్పుడు ఎందుకు మాట్లాడలేదని హోంమంత్రి ప్రశ్నించారు.
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలకులు చేసిన పాపాలవల్లే విద్యుత్ కష్టాలు ఏర్పడ్డాయని, విద్యుత్ ప్రాజెక్టులను ఆంధ్రాలోనే నిర్మించారన్నారు. సీఎం కేసీఆర్ మూడేళ్లపాటు కరెంటు కష్టాలు తప్పవని ఎన్నికలముందు దాచిపెట్టకుండా చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు ఒత్తిళ్లకు తలొంచి మోడీ తప్పుచేస్తే తమను బద్నాం చేయడం మంచిది కాదన్నారు.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు రుణమాఫీ చేసి తీరుతామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిట్నీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని కాబినెట్ సమావేశంలోనే ఏకగ్రీవంగా తీర్మానించామని, ప్రతిపక్షాల కుట్రలను రైతులు పట్టించుకోవద్దని ఆయన సూచించారు. పొన్నాల మాటలు విని ప్రజలు నవ్వుతున్నారని, రాష్ట్రాన్ని నాశనం చేయడమే కాకుండా సీఎంను విమర్శించడం ఎంతవరకు సమంజసమని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.