రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఖాళీ అవుతున్నాయి. నాయకత్వ లోపం, అవమానాల కారణంగా కాంగ్రెస్, టీడీపీలనుండి పలువురు నాయకులు ఆయా పార్టీలను వీడుతున్నారు. తెలంగాణలో పరిపాలనను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం పైన ఉన్న నమ్మకంతో ఇరు పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. వీరిలో ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మొదలుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ స్థాయి నేతలవరకు ఉంటున్నారు. తాజాగా ఖమ్మం మాజీ ఎంపీ, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన టీడీపీ నేత నామా నాగేశ్వరరావు, వివిధ జిల్లాల టీడీపీ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నేతలు గురువారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
కాంగ్రెస్ నుండి ఇప్పటికే తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గులాబీ పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే. మరోవైపు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నేతకాని వెంకటేష్ గులాబీ కండువా కప్పుకున్నారు. షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా శుక్రవారం టీఆర్ఎస్ లో చేరనున్నారు.