By: కట్టా శేఖర్‌రెడ్డి
ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెసు సమన్వయ కమిటీకి నాయకత్వం వహించిన జీ.చిన్నారెడ్డి మంగళవారంనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ “మిషను కాకతీయ అనే నినాదాన్ని మాపై రుద్దవద్ద’న్నాడు. కాకతీయ అన్నది ఉత్తర తెలంగాణకు చెందినది కాబట్టి దక్షిణ తెలంగాణపై దానిని రుద్దవద్దని ఆయన సెలవిచ్చారు. ఇంతకు ముందు మాజీ మంత్రి అరుణమ్మ కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. బతుకమ్మకు మాకు సంబంధం లేదని చెప్పారు. ఈ మాటలన్నీ విని గురువారంనాడు అమెరికా నుంచి ఒక పెద్దాయన ఫోను చేశారు. ఆయన తన కోపాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక పత్రికాఫీసుకు ఫోను చేశారు.
“వీళ్లు తెలంగాణ మనుషులేనా? వీళ్లకు ఏమైంది? హైదరాబాదులో ప్రతివీధికి, ప్రతి సంస్థకు ఆంధ్రా నాయకుల పేర్లు పెడుతున్నప్పుడు కానీ, సందు సందులో వారి విగ్రహాలు వెలుస్తున్నప్పుడు కానీ, పొట్టి శ్రీరాములు పేరు ఊరూవాడా పెడుతున్నప్పుడు.. రాజశేఖరరెడ్డి విగ్రహాలు ప్రతి గ్రామాన వెలుస్తున్నప్పుడు కానీ, శ్రీశైలం రిజర్వాయరుకు నీలం సంజీవరెడ్డి పేరు పెడుతున్నప్పుడు కానీ వీళ్లెవరూ నోరు మెదపలేదు. కొన్ని నిర్ణయాలలో వీరు కూడా భాగస్వాములు. వీళ్ల మెదళ్లు ఇంతగా చెడిపోయాయా? కాంగ్రెసు నాయకులే ఇంత సంకుచితమైనవారా? వీళ్లను ఏమి చేయాలండీ?’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొందరు నాయకులు ఆత్మవినాశకారులు. వాళ్లను ఎవరూ నాశనం చేయలేరు. వాళ్లను వాళ్లే బొందపెట్టుకుంటారు. ఎక్కడ మొదలు పెడతారో ఎక్కడ పడిపోతారో తెలియదు.