mt_logo

కాంగ్రెస్ కు ఓటేస్తే మురికి కాల్వలో ఓటేసినట్లే – హరీష్ రావు

మెదక్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే మురికి కాల్వలో వేసినట్టేనని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సూచించిన జగ్గారెడ్డికి బీజేపీ టిక్కెట్ ఇచ్చిందని, ఆంధ్రాబాబుల కొమ్ము కాస్తున్న జగ్గారెడ్డికి డిపాజిట్ కూడా రాకుండా చేసి బుద్ధిచెప్పాలని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు ఓటర్లకు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ లో తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) జిల్లా సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, టీఎంయూను ఆదర్శ కార్మిక సంఘంగా తీర్చిదిద్దుతామని కార్మికులను కోరారు.

తెలంగాణ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల గ్రాంట్ ను విడుదల చేసిందని, అది చూసి ఏపీ సీఎం చంద్రబాబు కూడా గ్రాంట్ ఇస్తున్నట్లు ప్రకటించారని చెప్పారు. ఆర్టీసీ విభజన జరిగితేనే తెలంగాణ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని, ఆదాయం వచ్చే రూట్లలో ఆంధ్రా బస్సులు తిరుగుతున్నాయని, ఆదాయం రాని రూట్లలో తెలంగాణ బస్సులను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *