mt_logo

ఫోన్ ట్యాపింగ్‌ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వెబ్ సిరీస్ నడిపిస్తుంది: బీఆర్ఎస్ నేత క్రిశాంక్

ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ.. వంద కోట్లు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ సభలో కేసీఆర్‌ను తిట్టడానికే పరిమితం అయ్యారు. కాంగ్రెస్ నాలుగు నెలల్లో ఏం చేసిందో సభలో చెప్పలేదు అని విమర్శించారు.  

కేసీఆర్‌పై రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం వెబ్ సిరీస్ నడిపిస్తుంది. మోడీకి ఈడీ.. కాంగ్రెస్ పార్టీకి ఫోన్ ట్యాపింగ్ అని పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌లో పది లక్షల ఫోన్లను ట్యాప్ చేస్తే పది లక్షల ఆఫీసులు కావాలి కదా. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అవసరం అని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. మన్మోహన్ సింగ్ పై ఫోన్ ట్యాపింగ్ వెబ్ సిరీస్ నడిపించారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి సారధిగా సోనియా గాంధీ ఉన్నారు.. రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు. రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటపెట్టలేమని ట్రాయ్ చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందిని కాపాడే ప్రయత్నం చేస్తోంది అని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ చేయండి. టెలికాం రెగ్యులేటరీ, పోలీసు ఉన్నత అధికారులను విచారణకు పిలవండి. జానారెడ్డి హోంమంత్రిగా పని చేశారు.. జానారెడ్డిని విచారణకు పిలవండి అని క్రిశాంక్ తెలిపారు

అధికారులను టార్గెట్ చేసి గత ప్రభుత్వం, కేసీఆర్‌పై ఆరోపణలు చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. టెలికామ్ సంస్థలకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా.. మన్మోహన్ సింగ్‌ను విచారణ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తారా అని అడిగారు.

లిక్కర్ కేసులో ఇప్పటి వరకు మనీ ట్రేడింగ్ జరగలేదు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కేసులో ఈడీకి టీవీ, ఫ్రిడ్జ్ దొరికింది. తెలంగాణలో బీజేపీ నేతలు బండి సంజయ్ ,రఘునందన్ రావును బీఆర్ఎస్ ఓడించింది అని గుర్తు చేశారు.

కరీంనగర్‌లో ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు.. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు తెలంగాణలో కుమ్మక్కయ్యాయి. రాహుల్ గాంధీపై ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తాం..జాతీయ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేశామని మన్మోహన్ సింగ్ అనలేదా అని దుయ్యబట్టారు.