హైదరాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో పనిచేసి రెండు సార్లు ఉత్తమ కలెక్టర్ గా అవార్డులు అందుకున్న స్మితా సబర్వాల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదనపు కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ లో ప్రజాసంక్షేమం కోసం అరుదైన కార్యక్రమాలు చేపట్టి ఉత్తమ కలెక్టరుగా ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. 2013 అక్టోబర్ 16న మెదక్ జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన స్మిత ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సిద్దిపేటలో గర్భిణులు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అధునాతన సౌకర్యాలతో హైరిస్క్ సెంటర్లు ఏర్పాటయ్యాయి.
సంక్షేమ హాస్టళ్ళ పనితీరు మెరుగుపరిచేందుకు స్కైప్ పద్ధతిని తీసుకొచ్చారు. ఆన్ లైన్ లో హాస్టళ్ళలోని విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం, మెనూ ప్రకారం భోజనాలు అందేలా చూడటం చేశారు. ఓటు వేయండి. నానో కారు గెలవండి అంటూ ప్రచారం చేపట్టడం ద్వారా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఓటు శాతం పెరిగేలా స్మితా సబర్వాల్ చేశారు. ఆమె సమర్ధ పాలన చూసి సీఎం కేసీఆర్ గజ్వేల్ బహిరంగసభలో ప్రశంసించారు. స్మితా సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో అడిషనల్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.