“ముఖ్యమంత్రీ నీ అంతట నీవే, నేను సమైక్యవాదినని చెప్పుకున్నవ్, ఇక నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతికహక్కు లేదు. రాజీనామా చేసి 24 గంటల్లో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చెయ్. అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించి మాట్లాడుతుంటే ఇంకా ఎందుకు ఆయన్ని కొనసాగిస్తున్నది? వెంటనే బర్తరఫ్ చేయాలి.తెలంగాణ మంత్రుల్లారా ఇప్పటికైనా తేల్చుకోండి. మీరు ఇంకా ఈ 13 జిల్లాల సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తారో..? లేక తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారో..? తేల్చుకోండి” అంటూ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్ రావు నిప్పులు చెరిగారు.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చి, ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్న కిరణ్ కు ఒక్కక్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. సీఎం పిచ్చోడిలా అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.తెలంగాణ నోటి కాడి బుక్కను ఎత్తగొట్టేలా విషం కక్కుతుంటే మీరు ఆయనతో ఎట్లా పనిచేస్తారని హరీశ్ తెలంగాణ మంత్రుల్ని నిలదీశారు.