తెలంగాణ బిల్లు చెల్లదని సీఎం కిరణ్ చేస్తున్న వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. చెల్లనిది తెలంగాణ బిల్లు కాదని, సీఎం కిరణ్ అని, చెల్లని రూపాయికి గీతలెక్కువ, చేతగానోనికి మాటలెక్కువ అన్నట్లు సీఎం తీరు ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు జరిగితే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామని కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి గొంతుచించుకొని అరుస్తున్నారని, త్వరలో వారికి ఆ గతి పట్టడం ఖాయమని చెప్పారు. ప్రజలే వీరిద్దరికీ రాజకీయ సన్యాసం చేస్తారని కూడా అన్నారు.
శుక్రవారం నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం తంగెడపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మెదక్ జిల్లా సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడారు. 15 రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితీరుతుందని, 14 ఏళ్ళుగా కేసీఆర్ చేస్తున్న పోరాటం, 1200 మందికిపైగా అమరుల త్యాగం ఫలిస్తాయని చెప్పారు. ఈ నెల 15, 16 తారీఖుల్లో తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడ్తారని, తప్పకుండా బిల్లు ఆమోదం పొందేలా కేసీఆర్ కృషి చేస్తారని స్పష్టం చేశారు. బిల్లు తిరస్కరించాలని సీఎం ఇచ్చిన తీర్మానం చిత్తుకాగితంతో సమానమని వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లుపై చర్చలో మాట్లాడకుండా చంద్రబాబు ముఖం చాటేశాడని హరీష్ మండిపడ్డారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా అంకితభావంతో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలో వడగండ్ల వాన పడితే పైసా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం సీమాంధ్రలో కొబ్బరిచెట్టుకు 500 రూపాయలు నష్టపరిహారం చెల్లించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.