mt_logo

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పూర్తిగా చెల్లించాలి-కేసీఆర్

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పూర్తిగా చెల్లించాలని ప్రధాని నరేంద్ర మోడీకి మంగళవారం ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు లేఖ రాశారు. కేంద్రం రుణం తీసుకుని రాష్ట్రాలకు పూర్తిగా పరిహారం ఇవ్వాలని, పరిహారం తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరారు. నష్టం జరుగుతుందని తెలిసినా జాతి ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ బిల్లును సమర్ధించిందని, అన్ని రాష్ట్రాలకన్నా ముందే స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది తెలంగాణ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. సీఎస్టీ ని రద్దు చేసే సమయంలో పూర్తి పరిహారాన్ని అందజేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్రాలు సీఎస్టీ పరిహారాన్ని తిరస్కరించాయి. రాష్ట్రాల ఒత్తిడి మేరకు రెవెన్యూ నష్టాన్ని పూడ్చడానికి ప్రతి రెండు నెలలకోసారి పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లించే విధంగా చట్టంలో నిబంధన ఉన్నా జీఎస్టీ పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏప్రిల్ నుండి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందలేదు. కోవిడ్-19 కారణంగా 2020 ఏప్రిల్ లో తెలంగాణ 83 శాతం రెవెన్యూను కోల్పోయింది. అదే సమయంలో రాష్ట్రాల అవసరాలు, చెల్లింపుల భారం పెరిగిపోయింది. ఓవర్ డ్రాఫ్టులు, మార్కెట్ బారోయింగ్స్ ద్వారా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చక్కబెడ్తున్నాం. దేశ ఆర్ధిక వ్యవస్థ కేంద్రం చేతుల్లో ఉన్న కారణంగా రాష్ట్రాలు విధిగా కేంద్రంపై ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. మార్కెట్ బారోయింగ్ లకు కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *