mt_logo

కేసీఆర్ దే ఘన విజయం: బిజినెస్ స్టాండర్డ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భారత దేశంలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన రెండవ ముఖ్యమంత్రి అని ప్రముఖ ఆంగ్ల జాతీయ పత్రిక బిజినెస్ స్టాండర్డ్ ఒక ఆసక్తికరమయిన విశ్లేషణను ప్రచురించింది. ప్రథమ రంగమయిన వ్యవసాయం, తృతీయ రంగమయిన పారిశ్రామిక రంగాల్లో తనదయిన ప్రత్యేకతను చాటుకుంటూ, చెప్పుకోదగిన వృద్ధిని సాధించిన కారణంగానే, ఎంతో ఆత్మ విశ్వాసంతో ముందస్తు ఎన్నికలకు సాహసించారని పేర్కొన్నది.

2001 లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, ఒక్కడుగా ఉద్యమాన్ని తలకెత్తుకుని లక్షల మందిని భాగస్వామ్యులుగా చేర్చిన ఘనత ఆయనదే. 2014 లో తెలంగాణ రాష్ట్రం కల సాకారమయి, ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుండీ ఇప్పటివరకూ అభివృద్దే ధ్యేయంగా తన పరిపాలన సాగిస్తున్నారు. బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది, పేదల సంక్షేమమే ప్రధానంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి అని, ముఖ్యంగా రైతులకు లక్ష రూపాయల వరకూ రుణ మాఫీ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరానికి ఎనిమిది వేల రూపాయలను రెండు విడతల్లో ఎరువులు, విత్తనాలకు సాయంగా అందిస్తున్నారనీ, అవినీతిమయంతో కూరుకుపోయిన గత పాలకుల భూమి రికార్డులను సంస్కరించి రైతులకు ఎనలేని మేలు చేసారని.. ఈ కారణాలు చాలేమో ముందస్తు ఎన్నికలకు సమాయత్తం కావడానికి అని ప్రస్తుతించింది. ఇవేకాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన ఇంకొక మంచి పని సాగునీటి ప్రాజెక్టుల మీద దృష్టిసారించి సీతారామ సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులను చేపట్టారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పధకాలతో నీటిని అందించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్లనే ప్రజలందరి మన్ననలు పొందారనీ, ముందస్తు ఎన్నికలకు సాహసించారనీ బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఉద్ఘాటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *