రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయను ఈరోజు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని సదాశివనగర్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం పదిగంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి సదాశివనగర్ చేరుకుంటారు. 11 గంటలకు మిషన్ కాకతీయ ప్రారంభోత్సవంలో పాల్గొని స్వయంగా తట్ట మోయనున్నారు. తర్వాత మెదక్ జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టకు చేరుకొని అక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు.
రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల శాఖ మొత్తం 46,447 చెరువులను గుర్తించగా, వాటిలో ఏడాదికి 9,573 చొప్పున రాబోయే ఐదేండ్లలో పునరుద్ధరించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 9,013 చెరువులను సర్వే చేశారు. 2,210 చెరువులకు టెండర్ల ప్రక్రియ కూడా ముగిసింది. వాస్తవానికి ఈ కార్యక్రమం వరంగల్ జిల్లాలో ప్రారంభించాలనుకున్నప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో నిజామాబాద్ కు మార్చారు.