స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఐదవరోజైన బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నగరంలో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రం మొత్తం వడగాలులు వీస్తున్నా లెక్కచేయకుండా నగరం మొత్తం తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. “తాను జగమొండినని, చెప్పింది చేసి తీరుతానని, పేదలు బాగుపడితేనే తమ ప్రభుత్వానికి తృప్తి అని సీఎం స్పష్టం చేశారు.” స్వచ్ఛ హైదరాబాద్ ను సంపూర్ణంగా సాకారం చేసుకునేందుకు కోటీ అరవై లక్షల చేతులు కలవాలని, ఈ ఐదు రోజుల కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం దృష్టికి వచ్చిన నగర సమస్యలపై ఈ నెల 22న అధికారులతో సమావేశమై నగరాభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.
వివిధ బస్తీల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, నగరం శుభ్రంగా ఉండాలంటే బస్తీల స్వరూప స్వభావాలు మారాలని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చారు. చెత్తపై యుద్ధంలో ప్రజలే కథానాయకులుగా ఉండాలని, ప్రభుత్వం ఎంత చేసినా ఇంకా మిగిలే ఉంటుందని, ఏ బస్తీలో ఉన్న వాళ్ళు ఆ బస్తీలో, ఏ గల్లీలో ఉన్నవాళ్ళు ఆ గల్లీలో ఎక్కడికక్కడ ప్రజలే కథానాయకులు కావాలని అన్నారు. ఇళ్ళు లేని వారికి ఇళ్ళు రావాలన్నా, శుభ్రమైన నీళ్ళు రావాలన్నా ప్రభుత్వం, ప్రజలు కలిసి యుద్ధం చేస్తేనే బాగుపడే పరిస్థితులు వస్తాయని, అర్హులందరికీ ఇళ్ళు ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయని, ఒక్కో ఇంటిని రూ. పది లక్షలతో నిర్మిస్తామని, జూన్ 2 నుండి నగరంలో ఇళ్ళ క్రమబద్దీకరణకు సంబంధించి లక్షమంది పేదలకు పట్టాలు పంపిణీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
అనంతరం పాతబస్తీలో పర్యటించిన సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్ లో, మొత్తం తెలంగాణలో గంగా, జమునా తహజీబ్ పరిమళాలు వెదజల్లాలని, పాతబస్తీకి పూర్వవైభవం రావాలన్నారు. చార్మినార్ నియోజకవర్గం డబీర్ పుర డివిజన్ లోని బాల్ శెట్టి కేఫ్ వద్దకు వెళ్లిన సీఎం అక్కడి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ 38 మంది పేదలకు ఇళ్ళు కట్టిస్తానని, మంచి గాలి, వెలుతురు వచ్చేలా ఇళ్ళ నిర్మాణం ఉంటుందని సీఎం వారికి హామీ ఇచ్చారు. అనంతరం సైదాబాద్ డివిజన్ లోని ఎర్రకుంటను సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ శ్మశానవాటిక కబ్జాకు గురవుతున్నది.. మీరు వచ్చి పరిస్థితిని సమీక్షించాలని ఎంపీ అసదుద్దీన్ తనకు చెప్పారని, అసదుద్దీన్ ఈ విధంగా చొరవ తీస్కోవడం తనకు సంతోషం కలిగించిందని, కబ్జాదారులు ఎంతటివారైనా వారిని తొలగించాలని సీఎం అధికారులను ఆదేశించారు.