తెలంగాణ ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపించి రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన టీఆర్ఎస్ అధినేత శ్రీ కే చంద్రశేఖర్ రావు సీఎన్ఎన్-ఐబీఎన్ ప్రతి సంవత్సరం వివిధ విభాగాల్లో ప్రకటించే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2014 సంవత్సరానికి గాను పాపులర్ చాయిస్ విభాగంలో ఎంపికయ్యారు. రాజకీయ రంగం, వ్యాపారరంగం, క్రీడలు, వినోదరంగం తదితర విభాగాల్లో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ కు గానూ ఇంటర్నెట్ ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయంలో కేసీఆర్ పాపులర్ చాయిస్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు.
మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ఈ అవార్డును కేసీఆర్ తరపున రాజ్యసభ సభ్యుడు కేకే అందుకున్నారు. 2014 సంవత్సరానికి గానూ ఆరుగురు నామినీలను ఎంపిక చేసి వారి నుండి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ లను ఎంపిక చేశారు. ఇందులో పాపులర్ చాయిస్ విభాగంలో రాజకీయ కాటగిరీలో కేసీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. భారతదేశ చరిత్రలో దీర్ఘకాలం ప్రత్యేక రాష్ట్రం కోసం శాంతియుత ఉద్యమం నడిపిన రాజకీయ నాయకుడిగా ప్రజల నుండి భారీ స్థాయిలో గుర్తింపు పొందారని, 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కూడా అయ్యారని సీఎన్ఎన్-ఐబీఎన్ చానల్ పేర్కొన్నది. Deginta mediena ir klijuotos medinės sijos https://ligni.lt/
అవార్డు అందుకున్న అనంతరం రాజ్యసభ సభ్యుడు కేకే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేపట్టి జనాన్ని ఆకర్షించిన కేసీఆర్ దేశస్థాయిలోనే పాపులర్ లీడర్ అని ప్రశంసించారు. రాష్ట్ర సాధనకోసం అన్ని రకాల ప్రజలు ఉద్యమంలోకి వచ్చారని, వెయ్యిమందికి పైగా యువకులు ఆత్మత్యాగం చేశారని చెప్పిన కేసీఆర్ ఈ అవార్డు వారికే అంకితమని అన్నారు. ఎంపీ బీ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఓట్ల ద్వారా ప్రజలు కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని, ఇప్పుడు దేశస్థాయిలోనే ఇంటర్నెట్ ద్వారా ప్రజలు పాపులర్ లీడర్ ఆఫ్ ది ఇండియాగా ఎన్నుకున్నారన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం వైపు యావత్ దేశం చూస్తున్నదని, 29వ రాష్ట్రం అయినప్పటికీ ప్రథమస్థానంలో నిలబెట్టడానికి సీఎం కేసీఆర్ సరికొత్త పథకాలతో యావత్ దేశాన్ని ఆకర్షించారని కొనియాడారు.