కేజీ టు పీజీ విద్యావిధానంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు సచివాలయంలో సమీక్షాసమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖల కింద పనిచేస్తున్న రెసిడెన్షియల్ విద్యాసంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు తేవాలని అన్నారు. నియోజకవర్గానికి సగటున 10 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉండేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1190 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేయాలన్నారు. నాలుగవ తరగతి వరకు పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చదవాలని, ఇందుకోసం గ్రామస్థాయిలో పాఠశాలలు నెలకొల్పాలని సూచించారు.
ఐదవ తరగతి నుండి ఆంగ్లమాధ్యమంలోనే బోధన చేయాలని, 12 వ తరగతి వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్యాబోధన చేయాలని సీఎం చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ ప్రవేశాలు కల్పించాలని, అన్ని పాఠశాలల్లో ఒకే రకమైన విద్యా వసతి సౌకర్యాలు కల్పించాలని, రెసిడెన్షియల్ స్కూళ్ళలో, హాస్టళ్ళలో విద్యార్థులు గ్రాముల చొప్పున కాకుండా ఎవరు ఎంత తింటే అంత అన్నం పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.