హరితహారం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంలా జరగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో కలెక్టర్లు, డీఎఫ్ వో, ఎస్పీలు, హౌసింగ్ శాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని హరిత ఉద్యమంలా మలచాలని పిలుపునిచ్చారు. ఆడియో, వీడియో ప్రచారాలు, పోస్టర్లు, కరపత్రాలు, కవి సమ్మేళనాలు, అవధానాలతో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. హరిత ఉద్యమంలో తాను కూడా పాల్గొంటానని, హెలికాప్టర్ లో కాకుండా బస్సులోనే అన్ని జిల్లాలు తిరుగుతానని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ల పాత్ర ఎంతో ఉందని, నియోజకవర్గాల వారీగా అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని రూపొందించాలని, ప్రచారానికి సాంస్కృతిక సారథి బృందాలను ఉపయోగించుకోవాలని సీఎం వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా మంచిపేరు వచ్చిందని, అధికారులు అంకితభావంతో పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని కేసీఆర్ ప్రశంసించారు. మళ్ళీ ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని, ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రచారం చేయాలని, ప్రతి వాహనంపై స్టిక్కర్లు అంటించాలని, గ్రామ పంచాయితీలు, ప్రార్ధనా మందిరాల వద్ద మైక్ సెట్ల ద్వారా హరితహారం పాటలు మార్మోగాలని సీఎం ఆదేశించారు. శ్రమదానం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని విభాగాల ఉద్యోగులతో పాటు పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, మిషన్ కాకతీయతో పాటు అనేక ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తెలంగాణ పోలీసులు మంచిపేరు తెచ్చుకున్నారన్నారు. కేవలం మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని పెంచి పెద్ద చేయడానికి అవసరమైన సంరక్షణ చర్యలు కూడా తీసుకోవలసి ఉంటుందని సీఎం పేర్కొన్నారు.