mt_logo

ఎంత ఖర్చు అయినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టాల్సిందే!

రాష్ట్రంలోని పేదవారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టి ఇవ్వాల్సిందేనని, దీనికోసం ఎంత ఖర్చు అయినా వెనక్కు తగ్గేదిలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.  సోమవారం సచివాలయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, జీవో 59 ప్రకారం భూముల క్రమబద్ధీకరణ ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదల ఇళ్ళ నిర్మాణానికి కేటాయిస్తామని, ఇప్పటికే బడ్జెట్ లో రూ. 1000 కోట్లు కేటాయించామని, ఇవి కూడా సరిపోకపోతే వివిధ మార్గాల ద్వారా వచ్చే నిధులను సర్దుబాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

దశలవారీగా ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టాలని, హైదరాబాద్ నగరం, ఇతర ప్రాంతాల్లో పేదల గృహనిర్మాణానికి అవసరమైన స్థలాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లోనూ పేదలకు ఇళ్ళు నిర్మించాలని, కేంద్రం ఇచ్చే నిధులకోసం ఎదురుచూడొద్దని సీఎం సూచించారు.కేంద్రప్రభుత్వం నీతి ఆయోగ్ సమావేశాలు నిర్వహించి సంక్షేమ కార్యక్రమాలు వేర్వేరుగా కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా నిర్వహిద్దామని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణ పథకం ఎంతో గొప్పగా ఉందని కూడా కేంద్రం ప్రశంసించింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును సీఎం కేసీఆర్ కలిసినప్పుడు పట్టణ గృహ నిర్మాణ పథకానికి కేంద్రం నుండి నిధులు ఇస్తామని, కలిసి పనిచేద్దామని కూడా సూచించారు.

కేంద్రం సాయంపై ఏడాదికాలంగా ఎదురు చూసినా కేంద్రం నుండి తగిన సానుకూలత రాకపోవడంతో పూర్తిగా రాష్ట్ర నిధులతోనే ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బడ్జెట్ లో కేటాయించిన రూ. 1000 కోట్లతో పాటు భూముల క్రమబద్ధీకరణతో వచ్చే రూ. 500 కోట్లు కూడా కేటాయించాలని ఆర్ధికశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అవసరమైతే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విలువైన భూములను వేలం వేసి వచ్చే ఆదాయాన్ని కేటాయిద్దామని సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశంలో గృహనిర్మాణ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *