తెలంగాణ రాష్ట్ర వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. శాసనసభలో స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిలో చైర్మన్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో సభా సమావేశాలు జరిగాయి. సభ ప్రారంభం కాగానే జాతీయ గీతాలాపన అనంతరం స్పీకర్ అనుమతితో సీఎం కేసీఆర్ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నగరంలోని డీఆర్ డీవోకు మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం పేరు పెట్టాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. కలాం మృతికి తెలంగాణ ప్రభుత్వం, ప్రజల పక్షాన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, కలాం మరణం దేశానికి, రక్షణ రంగానికి తీరని లోటని అన్నారు. అధ్యాపకుడిగా, శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా కలాం ఎనలేని సేవ చేశారని, హైదరాబాద్ తో కలాంకు విడదీయరాని అనుబంధం ఉందని గుర్తుచేశారు.
అనంతరం ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానంలోనే కాదు, మానవతా దృక్పథంలోనూ కలాం జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. కలాం గొప్పదనాన్ని మాటల్లో చెప్పలేమని, దేశరక్షణ కోసం కలాం ఎంతో కృషి చేశారని, కలాం ఆలోచన విధానాన్ని భారతజాతి అనుసరించాలని జానారెడ్డి పేర్కొన్నారు. జీజేపీ శాసనసభాపక్ష నేత డా. లక్ష్మణ్ మాట్లాడుతూ కలాం గొప్ప మానవతావాది అని, కలాం జీవితం అంతా యువతకు స్ఫూర్తినిచ్చేందుకు కృషి చేసారని, అబ్దుల్ కలాం మ్యాన్ ఆఫ్ మిస్సైల్ గా ప్రఖ్యాతి గాంచారని అన్నారు. అనంతరం ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ విద్యార్ధులకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి కలాం అని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే విద్యార్థులకు దిశానిర్దేశం చేయాలని కలాం సూచించారని ఈటెల గుర్తుచేశారు. అటు శాసనమండలిలోనూ అబ్దుల్ కలాం మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.