ఐదురోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్ళిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. బ్రాండ్ తెలంగాణ నినాదంతో తెలంగాణకు అంతర్జాతీయ పేరుప్రఖ్యాతులు కల్పించే దిశలో సీఎం కేసీఆర్ సింగపూర్, కౌలాలంపూర్ లలో జరిగిన అనేక సదస్సులలో పాల్గొన్న విషయం తెలిసిందే. సింగపూర్ పారిశ్రామిక వేత్తల సదస్సు, ఐఐఎం విద్యార్థుల అలుమ్ని-ఇంపాక్ట్ సదస్సు, అర్బన్ రీ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులతో సమావేశం జరిపిన అనంతరం కౌలాలంపూర్ లో శాటిలైట్ నగరాల తీరుతెన్నులను, మోనోరైల్ వ్యవస్థను అధ్యయనం చేసిన కేసీఆర్ మలేషియా ప్రధానితో సమావేశమై అనేక అంశాలను చర్చించారు.
ఆదివారం రాత్రి 11గంటల55నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రికి ఉపముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్ స్వాగతం పలికారు. సీఎంతో పాటు సింగపూర్ పర్యటనకు వెళ్ళినవారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.