ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఉదయం కరీంనగర్ చేరుకొన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు విచ్చేసిన సీఎంకు పార్టీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం జరిపారు. కరీంనగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు రాత్రి 7గంటలకు సీఎం మీడియాతో మాట్లాడనున్నారు.
మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలోని మానవపాడు మండలంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ, వచ్చే ఖరీఫ్ కు పాలమూరు జిల్లాలోని 5లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్డీఎస్ ఎత్తును పెంచి పాలమూరు జిల్లాకు రావాల్సిన 15.9 టీఎంసీల నీళ్ళను తీసుకువస్తామని చెప్పారు. అవసరమైతే పరిశ్రమలకు వారానికి రెండురోజుల పాటు కరెంట్ కోతలు విధిస్తామని, రైతులకు పూర్తిస్థాయిలో విద్యుత్ అందిస్తామని హరీష్రావు పేర్కొన్నారు.