mt_logo

తెలంగాణ పునర్నిర్మాణంలో మలయాళీలు భాగస్వాములు కావాలి..

ఇక్కడ నివసించే మలయాళీలను తెలంగాణ వారిగానే తాము భావిస్తామని, ఇక్కడి ప్రజలతో సమానంగా వారికి అన్ని హక్కులు ఉంటాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. హైదరాబాద్ లోని మలయాళీలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని, ఇందుకోసం మీ సహకారాన్ని కొనసాగించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఆదివారం ఫిలింనగర్ లో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీతో కలిసి సీఎం కేసీఆర్ కేరళ భవన్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం మాదాపూర్ శిల్పకళావేదికలో కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ రీజియన్ మలయాళీ అసోసియేషన్, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం విజయోత్సవం-2015 కార్యక్రమంలో ఇరువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు హాయిగా ఉన్నారని, మా ప్రజలు కూడా అందరితో కలిసి మెలిసి ఉన్నారని, ఈ నగరం ప్రపంచంలోనే గొప్ప నగరమని అన్నారు. గత సంవత్సరం కేరళీయం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కేరళ భవన్ కు స్థలం కేటాయిస్తానని, ఎకరం స్థలంతో పాటు రూ. కోటి రూపాయలు మంజూరు చేస్తానని ఇచ్చిన ప్రామిస్ ను నిలబెట్టుకున్నానని అన్నారు. అంతేకాకుండా తెలంగాణలో ఉన్న పేద మలయాళీల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కూడా కట్టిస్తామని, వాటిని ఇప్పుడే, ఇక్కడే మంజూరు చేస్తున్నానని కేసీఆర్ ప్రకటించారు. దేశంలోనే గొప్ప నేత ఊమెన్ చాందీ అని, అందరికీ తెలిసిన నాయకుడని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. కేరళకు గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్నాయని, తెలంగాణకు కూడా గొప్ప చరిత్ర సంప్రదాయాలు ఉన్నాయని, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలను ఇలాగే కొనసాగిద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు.

అనంతరం ఊమెన్ చాందీ మాట్లాడుతూ, తెలంగాణతో తమ బంధం అత్మబంధమని, ఈ బంధం ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. కేరళ మహిళలు ఇక్కడి సంప్రదాయాలు తెలుసుకోవాలని, ఇక్కడి ప్రజల్లో భాగస్వాములు కావాలని సూచించారు. గతంలో హైదరాబాద్ కు చాలా సార్లు వచ్చానని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రావడం ఇదే మొదటిసారని, ఈసారి కేరళ భవన్ కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. కేరళ భవన్ నిర్మాణానికి రూ. కోటి, ఎకరం స్థలం మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతఙ్ఞతలు తెలుపుతున్నానని, శబరిమలైలో అయ్యప్ప భక్తుల కోసం అక్కడ భవన్ నిర్మాణం తలపెట్టిన మొదటి రాష్టం తెలంగాణేనని, అందుకే నీలక్కల్ వద్ద ఐదు ఎకరాలు కేటాయించామని చాందీ వివరించారు.

ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకున్న కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా సీఎం క్యాంపు కార్యాలయం చేరుకొన్నారు. సుమారు 30 నిమిషాలపాటు ఇరువురు సీఎంలు పలు విషయాలపై ముచ్చటించుకున్నారు. కేరళ భవన్ కు స్థలం కేటాయించినందుకు ఊమెన్ చాందీ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపగా, శబరిమలలో అయ్యప్పస్వాముల వసతి కోసం నిర్మించ తలపెట్టిన తెలంగాణ భవన్ కు 5 ఎకరాల స్థలం కేటాయించినందుకు కేసీఆర్ కూడా చాందీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *