ప్రముఖ కవి కాళోజీ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరంగల్ బయలుదేరి వెళ్ళారు. సీఎం వరంగల్ చేరుకోగానే పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. నక్కలగుట్టలో ఉన్న కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ కాళోజీ కళాకేంద్రానికి శంకుస్థాపన చేశారు.
వరంగల్ నిట్ ఆడిటోరియంలో కాళోజీ శతజయంతి సంస్మరణ సభ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడున్న టీఆర్ఎస్ నేతలు, ప్రజలనుద్దేసించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కాళోజీ ఒక్క వరంగల్ కు, రాష్ట్రానికి, దేశానికి మాత్రమే పరిమితం కాదని, ఆయన విశ్వమానవుడని, ఆయన కవిత్వం విస్వజనీనమని చెప్పారు. కాళోజీ సహచర్యంలో ఎంతో స్ఫూర్తి పొందానని, ఆయనది రాజీపడని తత్వమని, నిష్కర్ష కలిగిన వ్యక్తని, నిర్మొహమాటస్తుడని, తెలంగాణ ముద్దుబిడ్డని ప్రశంసించారు.
కాళోజీ కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిసిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఇంకా ఈ దుస్థితి కొనసాగడం దారుణమని, కాళోజీ ఫౌండేషన్ పేరుమీద 10 లక్షల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిందిగా కలెక్టర్ కిషన్ కు సూచించారు. ఆ నగదుపై వచ్చే వడ్డీని ప్రతినెల కాళోజీ కుటుంబానికి అందించాల్సిందిగా ఫౌండేషన్ సభ్యులను కోరుతున్నట్లు సీఎం చెప్పారు. హైదరాబాద్ లో రవీంద్రభారతిని మించి కాళోజీ కళాక్షేత్రం ఉంటుందని, దీనికోసం 12 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇకనుంచి కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుందామని, ప్రభుత్వం త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు.