శుక్రవారం గ్రాండ్ కాకతీయ హోటల్ లో 14 వ ఆర్ధికసంఘం చైర్మన్ వైవీ రెడ్డి, ఇతర సభ్యులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశమై కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై రూపొందించిన ప్రణాళికలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు, పథకాలు, భవిష్యత్తులో సాధించబోయే లక్ష్యాలు, అభివృద్ధి ప్రణాళికలు తదితర అంశాలపై అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ తర్వాత వైవీ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అన్ని ప్రతిపాదనలపై తాము సోమవారం సమావేశమై చర్చిస్తామని, సీఎం కేసీఆర్ వివరించిన అంశాలు, సమస్యలపై లోతుగా అధ్యయనం చేస్తామని, తెలంగాణ రాష్ట్రానికి ప్యాకేజీ తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
భారతదేశం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోణంలో చూసినా ప్రత్యేక ప్యాకేజీ అవసరం ఉందని, ప్రభుత్వం ప్రజలకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రత్యేక సవాళ్లు తాము గుర్తించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో తమకున్న ఆలోచనలు, ఎదురయ్యే సమస్యలు, వనరుల సమీకరణను సీఎం విడమరిచి చెప్పడం, అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆర్ధికసంఘం సభ్యులను ఆద్యంతం ఆకట్టుకుంది.
దేశంలో ఎక్కాడా లేనివిధంగా వినూత్న పథకాలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నదనే విషయాన్ని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పట్ల సీఎం కేసీఆర్ కు నిజమైన శ్రద్ధ ఉందని సంఘం సభ్యులు ప్రశంసించారు. తాము కూడా రాష్ట్ర అవసరాలు తీర్చే విషయంలో అంటే శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రేమండ్ పీటర్, డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
