ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సీఎం కేసీఆర్ తో ఈరోజు ఉదయం సమావేశమై హైదరాబాద్ లో శాంతిభద్రతలపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖపై చర్చించారు. ఆ లేఖకు ప్రత్యుత్తరం ఈరోజే పంపించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ లేఖలో ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ పై గవర్నర్ అధికారాలను అంగీకరించమని ప్రభుత్వం తేల్చి చెప్పనుంది. న్యాయనిపుణులను సంప్రదించి అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.
ఈ లేఖపై పలువురు టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాసంఘాల నుండి పెద్దఎత్తున విమర్శలు చేశారు. ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, గవర్నర్ కు ఉమ్మడి రాజధాని అధికారాలపై కేంద్రం తన పరిధి దాటి వ్యవహరిస్తోందని, గవర్నర్ కు అధికారాలు ఇవ్వడం రాజకీయ కుట్ర అని, ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కేంద్రం లేఖపై అన్ని రాష్ట్రాల సీఎంలను కలిసి చర్చిస్తామని పేర్కొన్నారు.
ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణ సర్కారు పాలనను చూసి కేంద్రం ఓర్వలేకపోతుందని, ప్రత్యేకాధికారాలపై అవసరమైతే సుప్రీంకోర్టును సంప్రదిస్తామని చెప్పారు. హైదరాబాద్ పై గవర్నర్ పెత్తనం చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుట్రే అని భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్రం పెత్తనాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని, అవసరమైతే మరో పోరాటానికి సిద్ధమవుతామని డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు.
మరోవైపు హైదరాబాద్ పై కేంద్రప్రభుత్వ పెత్తనాన్ని నిరసిస్తూ తెలంగాణ వాదులు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఓయూ, నిజాం కళాశాలలలో టీఆర్ఎస్వీ విద్యార్థులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.