మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదెళ్ళ ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును క్యాంపు కార్యాలయంలో కలిశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ వచ్చిన సత్య నాదెళ్ళ మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ ను కలిసి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఇన్నోవేటివ్ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురాబోతున్నదని, హైదరాబాద్ ప్రతిష్ఠను అంతర్జాతీయంగా పెంచేందుకు సాఫ్ట్ వేర్ రంగానికి పెద్దపీట వేస్తామని కేసీఆర్ సత్య నాదెళ్ళకు ఈ సందర్భంగా తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాఫ్ట్ వేర్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, తమది పరిశ్రమల ప్రోత్సాహక ప్రభుత్వమని సీఎం వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిపై వారిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది.