గురువారం సచివాలయంలో బ్రిటన్ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి రాబ్ లైన్స్, బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన, ఆధునిక విద్యను వచ్చే సంవత్సరం నుండి అమలు చేయనున్నామని, అందుకు సహకరించాలని సీఎం కేసీఆర్ వారిని కోరారు.
ఇంగ్లీష్ మాధ్యమంలో ఉచిత నిర్భంద విద్యను అందించనున్నామని, బ్రిటన్ లో ఉన్న మ్యూజియాల తరహాలో సాలార్జంగ్ మ్యూజియాన్ని తీర్చిదిద్దుతామని కేసీఆర్ వారికి తెలిపారు. ప్రముఖ కవి షేక్స్ పియర్ ఇంటిని హెరిటేజ్ ప్రాపర్టీగా మార్చడాన్ని కేసీఆర్ ప్రశంసించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్, నర్సింగరావు, పరిశ్రమల కార్యదర్శి ప్రదీప్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఇదిలాఉండగా ప్రముఖ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(టీసీఎస్) ప్రతినిధులు కూడా గురువారం సచివాలయంలో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు, ఇప్పటికే తమ సంస్థలో 26 వేలమంది పని చేస్తున్నారని, త్వరలో మరో 28 వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. టీసీఎస్ కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వం నుండి అన్ని సహాయసహకారాలు ఉంటాయని సీఎం కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు.