mt_logo

పూడిక మట్టి తవ్వి తట్ట మోసిన ముఖ్యమంత్రి కేసీఆర్..

దశాబ్దాలుగా నిర్లక్ష్యంతో పూడుకుపోయిన 46 వేలకుపైగా చెరువులను మళ్ళీ యధాస్థితికి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సమైక్య పాలకుల వివక్షతతో గత వైభవాన్ని కోల్పోయిన చెరువులకు మహర్ధశ కల్పించే దిశగా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిజామాబాద్ జిల్లా సదాశివపేటలో ప్రారంభించారు. పాతచెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం మిషన్ కాకతీయ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం గడ్డపార చేతపట్టి చెరువులోని పూడికమట్టిని తవ్వారు. తవ్విన మట్టిని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి కలిసి తట్టలో ఎత్తి మంత్రి హరీష్ రావు నెత్తి మీదకు ఎత్తారు. మంత్రి హరీష్ ఆ మట్టిని పక్కనే ఉన్న ట్రాక్టర్లో వేశారు. అనంతరం మంత్రి పోచారం, ఏనుగు రవీందర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు మట్టి తట్ట నెత్తిన పెట్టారు. సీఎం కేసీఆర్ ఆ మట్టిని మోస్తూ పక్కనే ఉన్న ట్రాక్టర్ వద్దకు వెళ్లి అందులో మట్టిని వేశారు.

ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని, గతంలో అవకతవకలు చేసిన కాంట్రాక్టర్లకు మళ్ళీ పనులు అప్పగించొద్దని, వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశించారు. సదాశివనగర్ పాత చెరువులో ఏడెనిమిది ఫీట్ల మట్టి పూడుకుపోయి ఉంది. అరవై ఏండ్ల పాపం ఒక్కరోజుతో పోతుందా? కొత్త రాష్ట్రమైనా, అధికారులు లేకపోయినా, వనరులు సరిగా లేకపోయినా.. ఇంజినీర్లతో ఉరుకులు పరుగులు పెట్టించి సర్వే చేయించి వివరాలు పూర్తిగా తెప్పించుకున్నాం. ఖచ్చితంగా అందరం పిడికిలి పట్టాలి. ఎక్కడోళ్ళక్కడ పూనుకుంటేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. మన అదృష్టం మంచిగుంటే ఒక్క సంవత్సరం కాలమైతే వచ్చే మూడేళ్ళదాకా కరువు మన దిక్కు చూడదని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *