హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మేడ్చల్ నియోజకవర్గం నారపల్లిలోని భాగ్యనగర్ నందనవనంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ లా మారిందని, ఊపర్ షేర్వాణీ.. అందర్ పరేషానీ అన్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడా పచ్చదనం, పరిశుభ్రత లేదు.. కోటిమంది నివసించే సిటీలో పిల్లల్ని తీసుకుని పార్కుకు పోదామంటే చక్కటి పార్కు లేదు. వన భోజనానికి పోదామంటే వనంలాంటి స్థలం లేదు. హైదరాబాద్ లో గతంలో ఎన్నో బాగ్ లు ఉండేవి. బషీర్ బాగ్, పూల్ బాగ్, ఇడెన్ బాగ్…. అవన్నీ ఎక్కడికి పోయాయి? బాగ్ లు పోయి బంగ్లాలు వచ్చాయి. ముందు తరాలకు ఏం చేశామనేది ఆలోచించాలి.
హైదరాబాద్ ను నేను కట్టానంటే నేను కట్టా అంటారు.. ఊపర్ షేర్వాణీ.. అందర్ పరేషానీ అన్నట్లుగా ఉంది. దీన్ని హైటెక్ హైదరాబాద్, తొక్కా, తొండెం అంటారు.. ఈ పరిస్థితి మారాలి. ప్రజలు భాగస్వామ్యం కానిదే ఏ పథకం విజయవంతం కాదు.. ప్రైవేట్, ప్రభుత్వ విద్యారంగ సంస్థలు, తెలంగాణ టీచింగ్ కమ్యూనిటీ చెట్ల పెంపకం కార్యక్రమ బాధ్యత తీసుకోవాలి. అటవీ భూముల పరిరక్షణ ఒక్క సోషల్ ఫెన్సింగ్ తోనే సాధ్యం. ప్రపంచంలో అతి శక్తివంతమైన గన్ ఫెన్సింగ్ కంటే కూడా సోషల్ ఫెన్సింగ్ పవర్ ఫుల్. బొటానికల్ గార్డెన్ ను సమైక్యవాదులు అమ్మే ప్రయత్నం చేస్తే కోర్టును ఆశ్రయించి కాపాడుకున్నామని సీఎం గుర్తుచేశారు.
మేడ్చల్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గ ప్రజలకు గోదావరి నీరు అందిస్తామని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఖర్చుతో కనెక్షన్ ఇస్తామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సిటీ చుట్టూ ఉన్న గ్రామాలు హరితకంచె కావాలని, ఎన్ని మొక్కలైనా అందిస్తామని, వర్షాకాలం ముగిసేలోపు నందనవనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కోరారు. హరితహారం కార్యక్రమానికి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్, జూనియర్ సెక్షన్ ఆఫీసర్స్, బీట్ ఆఫీసర్స్ అసోసియేషన్ల ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖామంత్రి జోగురామన్న, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అటవీ శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ మిశ్రా, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, జెడ్పీ పాఠశాల విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.