రంగారెడ్డి జిల్లా చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మొక్కను నాటి హరితహారం పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ గుళ్ళో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగిస్తూ హరితహారం అంటే ఏదో కాదు.. మనిషికి నాలుగు మొక్కలు నాటి పెంచడమే అని అన్నారు.
గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల అద్భుతమైన అడవి ఉండేదని, ఇవాళ కంటికి కనపడకుండా పోయిందని, తెలంగాణకు ఆకుపచ్చ దండగా హరితహారం ఉండాలన్నారు. హైదరాబాద్ వచ్చి పోయిన వాళ్ళకు గండిపేట నీళ్ళు పడ్డాయి అనే వాళ్ళు. దీనికి కారణం గండిపేటలోకి అనంతగిరి, వికారాబాద్ అడవుల నుండి ఔషధ మొక్కల నీళ్ళు గండిపేటలోకి వెళ్లేవని గుర్తు చేశారు. వికారాబాద్ టీబీ ఆస్పత్రిని కూడా నిజాం అందుకోసమే కట్టించారని సీఎం కేసీఆర్ వివరించారు.
హరితహారం అంటే ఏదో ప్రభుత్వ కార్యక్రమం, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసుకునే కార్యక్రమం కాదు.. దీంట్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఆనాడు అడవులను నరకడం వల్ల కోతులకు పండ్లు ఫలాలు దొరక్క నేడు మన ఊళ్ళ మీదపడి పంట పొలాలను నాశనం చేస్తున్నాయని, మళ్ళీ కోతులు అడవులకు వాపస్ పోవాలని సూచించారు. ఈ సంవత్సరం అందరూ చెట్లు పెంచండి.. వచ్చే ఏడాది మీరు కోరిన చెట్లను అందిస్తామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ సాధించుకున్నాం.. అలాగే హరితహారాన్ని కూడా కలిసికట్టుగా విజయవంతం చేసుకుందాం. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని కార్యక్రమాలను చేపట్టి మనం విజయపథంలో దూసుకుపోతున్నామని, పచ్చదనం పెంచితేనే హరితహారం సాధ్యమని సీఎం అన్నారు.