క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ట్రిపుల్ ఎఫ్ రేడియో సర్జరీ విధానాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం యశోదా ఆసుపత్రిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గతంలో క్యాన్సర్ ను ప్రాణాంతకమైన వ్యాధిగా గుర్తించే వారని, కానీ ప్రస్తుతం వైద్యరంగంలో వచ్చిన మార్పులవల్ల క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చని అన్నారు. వైద్యరంగంలో వస్తున్న అత్యాధునిక పరిజ్ఞానాన్ని, నూతన చికిత్సా విధానాలను ఎప్పటికప్పుడు అనుసరిస్తూ వైద్య సేవలను అందించడంలో యశోదా హాస్పిటల్ ప్రధమస్థానంలో నిలుస్తుందని ప్రశంసించారు.
పేదప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో కార్పొరేట్ హాస్పిటళ్ళు ప్రభుత్వానికి సహకరించాలని, సామాజిక స్పృహతో పేదలకు మరింత సేవలు అందించాలని కోరారు. తెలంగాణలోని సంస్కృతి, ఆహార పద్దతుల వల్ల ఇక్కడ క్యాన్సర్ వ్యాప్తిని సహజసిద్ధంగా నిరోధిస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నారని, అయినప్పటికీ రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదని సీఎం చెప్పారు. వైద్యరంగం అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని ప్రతీ జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను స్థాపించి పేదప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని, అన్ని గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. యశోదా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జీఎస్ రావు మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలో ఫ్లాటనింగ్ ఫిల్టర్ ఫ్రీ (FFF) ఒక సంచలనమని, తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ తో కలిసి నడుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మై హోం సంస్థ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, పలువురు వైద్య నిపుణులు, అంతర్జాతీయ వైద్యులు పాల్గొన్నారు.