నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ లో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పైలాన్ ను ఆవిష్కరించి పాత చెరువులో స్వయంగా తట్ట, పారను చేపట్టి పాతచెరువు పూడికతీత పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, అద్భుతమైన మిషన్ కాకతీయ పథకం తన నియోజకవర్గంలో ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, చెరువుల పునరుద్ధరణతో మా ప్రాంతంలో ఉన్న నీటి సమస్య తీరుతుందని అన్నారు.
అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని చెరువులు మన రాష్ట్రంలో ఉన్నాయని, ఇవాళ గొప్ప రోజని, సీఎం కేసీఆర్ చేతులమీదుగా మిషన్ కాకతీయను ప్రారంభించడం చరిత్రలో నిలిచిపోయే రోజని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 46,447 చెరువులు ఉన్నాయని, ఈ ఏడాది 9,573 చెరువులను పునరుద్ధరిస్తామని, ప్రతీ సంవత్సరం 20 శాతం చొప్పున చెరువుల పునరుద్ధరణ చేసుకుంటూ పోతామన్నారు. టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని, తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ ఎట్లాగైతే పాల్గొని రాష్ట్రం సాధించుకున్నామో అదే విధంగా చెరువుల పునరుద్ధరణను ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. రైతులు స్వచ్చందంగా చెరువులో తీసిన మట్టిని పొలాల్లో వేసుకోవాలని, పూడికమట్టి పోసుకోవడం వల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గి 30 శాతం పంట దిగుబడి అధికంగా వస్తుందని హరీష్ తెలిపారు.