mt_logo

రాష్ట్రం నుండి గుడుంబా మహమ్మారిని తరిమికొట్టాలి!

జూదానికి ఎలాగైతే అడ్డుకట్ట వేశామో అదే రీతిలో గుడుంబాను కూడా నామరూపాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. గుడుంబాను అరికట్టే విషయంలో ఎక్సైజ్ సిబ్బందికి సివిల్ పోలీసుల సహకారం కూడా అందిస్తామని, ప్రస్తుతం రూపొందించే నూతన మద్యం పాలసీ ఆదాయంపై ఎక్కువ దృష్టి పెట్టేదిగా కాకుండా ప్రజలకు హాని తలపెట్టని విధంగా తయారు కావాలని సీఎం అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అబ్కారీ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి టీ పద్మారావు, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ అండ్ కమర్షియల్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

గుడుంబా మహమ్మారిని రాష్ట్రం నుండి పూర్తిగా తరిమికొట్టాలని, దీని కారణంగా పల్లెల్లో చిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో వినియోగమయ్యే మద్యాన్ని పూర్తిగా తెలంగాణలోనే తయారు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచాలని, నాన్ పెయిడ్ మద్యాన్ని పూర్తిగా నిరోధించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రజలకు కల్తీ లేని కల్లు అందించేందుకు పెద్ద ఎత్తున ఈత చెట్లు నాటాలని సూచించారు. దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి.. పర్యాటకంగా, పారిశ్రామికంగా, ఐటీ విభాగంలో దూసుకుపోతున్న నగరానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలనుండి వివిధ పనులపై హైదరాబాద్ కు వచ్చే వారున్నారు. అదేవిధంగా వివిధ జిల్లాలనుండి వచ్చి ఇక్కడ జీవిస్తున్నవారు అనేకమంది ఉన్నారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరంలో మద్యంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ప్రత్యేకంగా ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు.

గుడుంబా నిర్మూలన విషయంలో రాజకీయ జోక్యాన్ని సహించేది లేదని, తమ పార్టీ వారెవరూ గుడుంబా నివారణ వ్యవహారంలో జోక్యం చేసుకోరని సీఎం అధికారులతో అన్నారు. రాష్ట్రానికి ఆదాయ వనరులు పెంచేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకోవాలని, వాణిజ్య పన్నుల విభాగంలో కొన్ని ఉద్యోగాల నియామకానికి ఇప్పటికే అనుమతి ఇచ్చామని, ఇంకా ఖాళీలు ఉంటే భర్తీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి నాలుగు రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల్లో 14 చెక్ పోస్టులున్నాయని, అవి మరింత పటిష్ఠంగా పని చేయాలని సీఎం సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *