గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన నివాసంలో టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవడంలో ఎంపీలు దృష్టి సారించాలని, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు భారీగా నిధులు తేవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ ఎంపీలను ఆదేశించారు. పోలవరం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా త్వరలో అఖిలపక్షంతో ఢిల్లీ వస్తానని, ఆ సమయంలో ఎంపీలంతా అందుబాటులో ఉండాలని వారికి సూచించారు. ఈ నెల 24, 25 తేదీల్లో అఖిలపక్ష పర్యటనపై తుది నిర్ణయం తీసుకుని తేదీ ఖరారైన వెంటనే సమాచారం ఇస్తామని కేసీఆర్ వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వేణుగోపాలచారి, రామచంద్రుడిని నియమించామని, ఎలాంటి అధికారిక సమాచారం కావాల్సి వచ్చిన వారు ప్రభుత్వం నుండి తెప్పించి ఇస్తారని, వాటిని అనుసరించి కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేవాల్సిన బాధ్యత ఎంపీలకుందని స్పష్టం చేశారు. ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఉన్న పదిమంది ఎంపీలలో మహబూబ్ నగర్ జిల్లానుండి గెలిచిన జితేందర్ రెడ్డిని లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేతగా ప్రకటించిన విషయం తెలిసిందే. మిగిలిన తొమ్మిది మంది ఎంపీలకు స్టాండింగ్ కమిటీలు నిర్ణయించారు.
హోం శాఖకు బీ వినోద్, పరిశ్రమల శాఖకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వాణిజ్య శాఖకు కల్వకుంట్ల కవిత, వ్యవసాయ శాఖకు కడియం శ్రీహరి, రూరల్ డెవలప్మెంట్ శాఖకు బాల్క సుమన్, జలవనరుల శాఖకు బీబీ పాటిల్, కార్మిక శాఖకు డాక్టర్ బూరనర్సయ్య గౌడ్, సామాజికన్యాయం, సాధికారిత శాఖకు సీతారాం నాయక్, బొగ్గు మరియు ఇనుము శాఖకు నగేష్ లను కమిటీ సభ్యులుగా సీఎం కేసీఆర్ నియమించారు.