గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వాటర్ సప్లై, ట్రాఫిక్, శానిటేషన్ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో నగరంలో వచ్చే సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి స్వల్ప, దీర్ఘ కాలిక ప్రణాళికలతో రావాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ కై తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు.
ఇదిలా ఉండగా, సీఎం కేసీఆర్ ను పలువురు రాజకీయనేతలు, ప్రముఖులు, ప్రజలు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కే కేశవరావు, లోక్ సభ నేతగా జితేందర్ రెడ్డి, ఉపనేతగా బీ వినోద్, విప్ గా కడియం శ్రీహరిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. మరోవైపు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈనెల 6న డిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్రమంత్రులను ఈ సందర్భంగా కేసీఆర్ కలవనున్నారని తెలిసింది.