మంగళవారం సాయంత్రం రాజేంద్రనగర్ లోని ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (అపార్డ్) ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో గ్రామీణాభివృద్ధికి మూలకారణమైన మొదటి కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రి ఎస్ కే డే ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు గ్రామీణ స్థాయిలోనే రూపొందాలని, ఆక్కడే అమలు కావాలని స్పష్టం చేశారు.
అపార్డ్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి మామిడి మొక్కను నాటిన అనంతరం సీఎం అక్కడ ఏర్పాటు చేసిన పుస్తకాలను, ఆడియోలను పరిశీలించారు. స్థానిక సంస్థల అధికారాలు, విధులు, సంక్షేమ పథకాల అమలు, జాతీయ ఉపాథి హామీ పథకాలలో లోపాలను సవరించి కొత్త విధానాలను రూపొందించే విషయంలో అధికారులతో చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్ర నవ నిర్మాణానికి అపార్డ్ సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు.
కింది స్థాయిలోనే అవినీతిని నిరోధించే కార్యకర్తలుగా ప్రజాప్రతినిధులు తయారు కావాలని, ప్రజాప్రతినిధులకు వివిధ అంశాలపై శిక్షణ ఇప్పించాలని చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలు, సర్పంచులు మొత్తం కలిపి 18వేల వరకు ఉంటారని, వారందరికీ అపార్డ్, ఎన్ఐఆర్డీ, ఎంసీహెచ్ఆర్డీలతో శిక్షణ ఇప్పించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.