తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ కు టీఆర్ఎస్ ఎంపీలు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ ఢిల్లీ రావడం ఇదే మొదటిసారి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని మోడీని కలుసుకుని తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయసహకారాలను అందించాల్సిందిగా కోరనున్నారు. శనివారం ఉదయం న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ను కలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని మోడీతో, 6.15 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమౌతారు. సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీలందరూ ఈ భేటీలో పాల్గొంటారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా అమలుచేయాలని ప్రధానితో చర్చలు జరుపుతారని సమాచారం.
పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను సీమాంధ్ర ప్రాంతంలో కలుపుతూ కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని, డిజైన్ మార్చడం ద్వారా ముంపు ప్రాంతాల సంఖ్యను తగ్గించవచ్చని కేంద్రానికి సీఎం కేసీఆర్ వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పదిజిల్లాల్లో ఎనిమిది జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన విషయం తెలిసిందే. తెలంగాణ కొత్తరాష్ట్రంగా ఆవిర్భవించింది కాబట్టి కేంద్రం నుండి ఆర్ధిక సాయం అందించాల్సిందిగా ప్రధాని మోడీని, ఆర్ధిక మంత్రిని ఈ సందర్భంగా కేసీఆర్ కోరనున్నారు.
పునర్వ్యవస్థీకరణ చట్టంలో సూచించిన విధంగా తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని, హార్టికల్చర్ విశ్వవిద్యాలయాన్ని, ఖమ్మం జిల్లాలో ఇనుము-ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సి ఉన్నందున వాటికి సంబంధించిన అంశాలగురించి కూడా ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు కేకే, టీఆర్ఎస్ లోక్ సభ సభ్యులు, సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9నుండి ప్రారంభం కానుండటంతో కేసీఆర్ ఆదివారమే బయలుదేరి హైదరాబాద్ చేరుకోనున్నారు.