ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ పేరును ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుత్తా సుఖేందర్ రెడ్డి, నవీన్ కుమార్ లకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ నవీన్ కుమార్ పేరును ప్రకటించారు. త్వరలో ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం కల్పిస్తామని కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో ఉన్న టీఆర్ఎస్ సభ్యుల మెజార్టీ వల్ల నవీన్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. నవీన్ కుమార్ మంగళవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈనెల 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఈ ఎన్నిక జరగనున్నది. హైదరాబాద్ కు చెందిన నవీన్ కుమార్ 2001 నుండే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.