హైదరాబాద్ నగరాన్ని అత్యుత్తమ నగరంగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శ్రీకారం చుట్టారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో చెత్త సేకరణకు ఆటో ట్రాలీలు, చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ను సమైక్య పాలకులు నాశనం చేశారు. హైదరాబాద్ కు కష్టాలు, నష్టాలే. ఇక ఇప్పుడైనా హైదరాబాద్ ను బాగు చేసుకోవాలి. ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు నాంది పడింది. హైదరాబాద్ లో వాన పడితే కార్లన్నీ బోట్లవుతాయి. పరిశుభ్రత విషయంలో ఒక్క అడుగు ముందుకు వేయాలని నగరంలోని అన్ని పార్టీల నేతలతో చర్చించాం. ఆ తర్వాత ఆటో ట్రాలీలు, చెత్త బుట్టల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
1005 ఆటో ట్రాలీలు, చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్నాం.. హైదరాబాద్ నగరంలో 42 లక్షల చెత్త బుట్టలు అవసరం.. నవంబర్ నెలాఖరుకు చెత్తబుట్టలు పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు. అన్నం, కూరగాయలనుండి వచ్చే తడి చెత్తను ఆకు పచ్చ బుట్టలో వేయాలని, ప్లాస్టిక్, కాగితాలు వంటి చెత్తను నీలి రంగు బుట్టలో వేయాలని సీఎం ప్రజలకు సూచించారు. నగరంలో ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం కృషి చేస్తున్నామని, నగరానికి 30 టీఎంసీల నీటికోసం రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామని, నగరంలోని రోడ్లన్నీ అద్దాల్లా మెరిసేలా తయారు చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.