తెలంగాణ ముఖ్యమంత్రి వరుస సమావేశాలతో బిజీగా ఉంటున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిసి తమ సమస్యలు వివరించారు. పాఠశాల విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైందని, ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశామని వారు తెలిపారు. గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్ అన్నీ ఒకే శాఖ కిందకు వచ్చేలా చేయాలని చెప్పామని, కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఉండేలా చూడాలని, పెండింగ్ లో ఉన్న కామన్ సర్వీస్ రూల్స్ ను వెంటనే విడుదల చేయాలని కోరినట్లు వివరించారు.
రేపు తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొన్న అనంతరం జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ లో ఉన్న సమస్యలపై అధికారులతో సమావేశం జరిపి చర్చిచనున్నారు. మరోవైపు బ్యాంకర్లతో కూడా రేపే ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నట్లు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రైతుల రుణమాఫీ సహా వేరే అంశాలపై కూడా బ్యాంకర్లతో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలిసింది.