ఇరాక్ లో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల అక్కడున్న తెలంగాణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారోనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆరా తీయాలని, ఇరాక్ లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలో తెలంగాణ ప్రజలు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు.
ఈ విషయమై కేంద్ర విదేశాంగ శాఖతో సీఎస్ రాజీవ్ శర్మ సంప్రదింపులు జరిపారు. మరోవైపు ఇరాక్ లో పరిస్థితిని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ గంటగంటకు సమీక్ష జరుపుతున్నారని అధికారులు తెలిపారు. ఇరాక్ లోని భారతీయులను రక్షించేందుకు విదేశాంగ శాఖ చర్యలు చేపట్టిందని, విదేశాంగ శాఖ కార్యదర్శి అనిల్ వాద్వా ఇరాక్ రాయబారిని కలిసి చర్చలు జరుపుతున్నారని వివరించారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరాన్ని వైఫై నగరంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం దూసుకెళ్తోంది. ఈరోజు రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పలువురు ఐటీ నిపుణులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమై హైదరాబాద్ ను వైఫైగా మార్చేందుకు తీసుకోవలిసిన చర్యల గురించి చర్చలు జరిపారు.