mt_logo

చరిత్రలో ఎవరూ ఇంత కరెంట్ ఇవ్వలేదు – హరీష్ రావు

తెలంగాణలో ఉత్పత్తి కేంద్రాలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నామని, చరిత్రలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వాలు ఇవ్వనంత ఎక్కువ కరెంట్ తెలంగాణలో సరఫరా చేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గురువారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రప్రభుత్వం విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు.

‘రాష్ట్రంలో ప్రతిరోజూ 140 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తున్నాం. ఏపీ కేవలం 117 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేస్తున్నాడని, అక్కడ రోజూ 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉందని చెప్పారు. అక్టోబర్ 1 నుండి 15 వరకు తెలంగాణలో 2107 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తే ఏపీలో 1994 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశారని, తెలంగాణలో మేమిచ్చే కరెంట్ కన్నా ఆంధ్రాలో బాబు ఇస్తున్న కరెంట్ తక్కువేనని హరీష్ రావు స్పష్టం చేశారు. 9 ఏళ్ల చంద్రబాబు ప్రభుత్వం, 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడన్నా ఇంతకంటే ఎక్కువ విద్యుత్ ఇచ్చిందా అని, గతేడాది ఇదే సీజన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు 113 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేశారని గుర్తుచేశారు’.

రోజుకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టి కరెంట్ కొంటున్నామని, ఇది మేం చెప్తున్న గుడ్డి లెక్క కాదని, కేంద్రప్రభుత్వం వద్ద కూడా ఈ లెక్క ఉంటుందని, చంద్రబాబు దగ్గర కూడా ఈ లెక్క ఉంటుందని హరీష్ రావు చెప్పారు. రాజకీయాల కోసం టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని, పచ్చపార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు చాంబర్ ముందు ధర్నా చేస్తే కరెంటైనా వస్తుందన్నారు. లోయర్ సీలేరులో 400 మిలియన్ యూనిట్ల విద్యుత్ లో తెలంగాణకు 54 శాతం విద్యుత్ రావాల్సింది వాస్తవం కాదా? అని, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో సోలార్, విండ్, ఇతర పద్ధతుల్లో ఉత్పత్తి అవుతున్న 200 మెగావాట్లలో తెలంగాణకు కనీసం ఒక్క మెగావాట్ కరెంట్ ఇవ్వకుండా ఎగ్గొడుతుంది చంద్రబాబు కాదా? అని టీటీడీపీ నేతలను ప్రశ్నించారు. మోసం చేసింది, తెలంగాణకు కరెంట్ రాకుండా అడ్డుపడుతున్నది చంద్రబాబేనని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *